దర్శకత్వ ప్రతిభతో సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న రామ్ గోపాల్ వర్మ ఇటీవల తన మాటలు, చేతల కారణంగా అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఆయనలో ఉన్న అపారమైన ప్రతిభను దాటి, పెద్దలను లెక్క చేయని తనం, ఇతరులను ఎగతాళి చేసే ధోరణి పెరిగిపోయిందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కెరీర్ పాతాళానికి పడిపోయిన ఈ తరుణంలో తాను ఎంత గొప్ప దర్శకుడినో ఆయనే గుర్తుచేసుకునేలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఇటీవల నాగార్జున నటించిన క్లాసిక్ చిత్రం ‘శివ’ రీ-రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే, ‘శివ’ సినిమా గొప్పదనాన్ని వివరిస్తూ, దాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిభను మనస్ఫూర్తిగా అభినందించారు.
గతంలో చిరంజీవితో పాటు మెగా కుటుంబాన్ని రామ్ గోపాల్ వర్మ ఎన్నోసార్లు హేళన చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, వర్మ వైసీపీకి అనుకూలంగా ఉంటూ మెగా ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడారు. ఆ చేదు జ్ఞాపకాలన్నింటినీ మనసులో పెట్టుకోకుండా, చిరంజీవి కేవలం వర్మలోని దర్శకత్వ ప్రతిభను మాత్రమే ప్రశంసించడం ఆయన హుందాతనానికి నిదర్శనం.
తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కూడా ఆయన పనితీరు ఆధారంగా అభినందించడం ద్వారా చిరంజీవి గొప్ప మనిషిగా నిలిచారు. ఒక రకంగా, చిరంజీవి చేసిన ఈ ప్రశంసలు కేవలం అభినందనలు మాత్రమే కాకుండా, “ఎలాంటి గొప్ప ప్రతిభ కలిగిన దర్శకుడు ఇప్పుడు ఎలా దిగజారిపోయాడు” అన్న చర్చకు దారి తీశాయి. తన దర్శకత్వ ప్రతిభను పొగడడం ద్వారా, వర్మ ఏం పోగొట్టుకున్నారో అన్నది మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేయగలిగారు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.


