ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అధికార టీడీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజలకు ప్రయత్నించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు విసిరిన ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.
నిన్న ఉదయం స్విఫ్ట్ కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఘటనను గమనించిన ఎమ్మెల్యే అనుచరులు కారు వద్దకు వెళ్లేలోపే వారు పరారయ్యారు. కారునంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో, ఇది తెలిసిన వారి పనేనని ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఘటన వెనుక అసంతృప్త నేత హస్తం ఉండవచ్చని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మూఢనమ్మకాల పేరుతో ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


