ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత భోజనంలో బొద్దింక కనిపించడం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ సంఘటన రాష్ట్రంలోని హాస్టళ్లలో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
మంగళవారం నాడు బీసీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తుండగా హోంమంత్రి అనిత ప్లేటులో బొద్దింక కనిపించింది. ఈ ఊహించని సంఘటనతో ఆమెతో పాటు అక్కడి అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒక ప్రజాప్రతినిధి, పైగా హోంమంత్రి భోజనంలోనే ఇలాంటి పరిస్థితి ఎదురవడం, హాస్టళ్లలో విద్యార్థులకు అందించే ఆహారం ఎంత అపరిశుభ్రంగా ఉందో స్పష్టం చేస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో విద్యార్థులకు ఎంతటి నాసిరకం భోజనం పెడుతున్నారో అర్థమవుతోందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత జగన్ ప్రభుత్వంలో విద్యార్థులకు పౌష్టికాహారం, అమ్మ ఒడి పథకం కింద ఆర్థిక సహాయం, మెరుగైన వసతులు అందించారని, అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కనీసం మంచి ఆహారాన్ని కూడా అందించలేకపోతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హోంమంత్రి భోజనంలో బొద్దింక కనిపించిన ఈ వ్యవహారంతో, రాష్ట్రంలో ముఖ్యంగా విద్యాసంస్థల్లో ఆహార భద్రత, పరిశుభ్రతకు సంబంధించి మరింత పర్యవేక్షణ అవసరమని స్పష్టమైంది. ఈ సంఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
వీడియో కోసం క్లిక్ చేయండి