తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహాల్లో రాయలసీమ కీలక ప్రాంతంగా మారింది. గత దశాబ్దంలో ఈ ప్రాంతంలో వైయస్సార్ కుటుంబం, పెద్దిరెడ్డి కుటుంబం ఆధిపత్యం ప్రదర్శించగా, చంద్రబాబు ప్రభావం మాత్రం అంతగా బలంగా నిలబడలేదు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఉన్నప్పటికీ, రాయలసీమలో బలమైన పట్టు సాధించడంలో ఆయనకు లోటు అనిపించింది.
ఇప్పుడా లోటును పూడ్చేందుకు నారా లోకేష్ రంగంలోకి దిగారు. తరచూ రాయలసీమ పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. కడపలో మహానాడు, కూటమి సభల ద్వారా టీడీపీ సత్తా చూపించడానికి ప్రయత్నించారు. స్థానిక ప్రముఖ రాజకీయ కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, రాబోయే ఎన్నికల్లో బలమైన నాయకుడిగా ఎదగాలని లోకేష్ వ్యూహం.
అంతేకాకుండా, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కూటమి విజయాన్ని ఖాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో వైసీపీ ఆధిపత్యంలో ఉన్న ప్రాంతాల్లో కూడా టిడిపి జెండాలు ఎగరాలని ఆయన ప్రణాళిక. అంటే, చంద్రబాబుకు రాయలసీమలో ఉన్న లోటును భర్తీ చేస్తూ, పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే ఆలోచనలో లోకేష్ కనిపిస్తున్నారు.