ఆంధ్రజ్యోతి పత్రిక ఎప్పుడూ టిడిపికి అండగా నిలిచిందనే అభిప్రాయం ఉండేది. అయితే తాజాగా ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) చంద్రబాబు ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
తాజా కొత్త పలుకులో ఆయన, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల దోపిడీ విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. ఇసుక, మద్యం, కాంట్రాక్టులు వంటి రంగాల్లో ఎమ్మెల్యేల జోక్యం అధికమైందని, వీరిని నియంత్రించడంలో చంద్రబాబు విఫలమయ్యారని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలోనూ ఇంత స్థాయి స్వేచ్ఛ ఎమ్మెల్యేలకివ్వలేదని ఆయన వ్యాఖ్యానించడం ప్రత్యేకంగా గమనించదగ్గ అంశం.
రాధాకృష్ణ రాతలు కూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారాయి. ఆయన వ్యాసాల కటింగ్స్‌ను వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ టిడిపిపై దాడులు చేస్తోంది. మరోవైపు, ఈ విమర్శలకు సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వడంలో టిడిపి నాయకులు బలహీనంగా కనిపిస్తున్నారు.
ఇక రాధాకృష్ణ ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని హెచ్చరించడమా? లేక సిస్టమ్ లోపాలను బయటపెట్టడమా? అన్నది ఇప్పటివరకు మిస్టరీగానే మిగిలింది.