ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పర్యటనలు ఉంటాయని, ఈ పర్యటనలకు ముందు లేదా వాటితోపాటే ఒక పాదయాత్రను కూడా చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
తాజా ప్రకటనతో రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా, సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. “సోషల్ మీడియాలో పార్టీపరంగా యాక్టివ్‌గా ఉంటే, రాబోవు నా పాదయాత్రలో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి మాట్లాడే పరిస్థితి ఉంటుంది” అని జగన్ పేర్కొన్నారు. ఇది పార్టీ శ్రేణులలో, ముఖ్యంగా సోషల్ మీడియా విభాగంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
గతంలో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా లక్షలాది మంది ప్రజలను నేరుగా కలుసుకున్న జగన్, వారి సమస్యలను ఆలకించి, పార్టీ సిద్ధాంతాలను వివరించారు. ఇప్పుడు మరోసారి పాదయాత్రకు సన్నద్ధం అవుతుండటం చూస్తుంటే, ప్రజలతో నేరుగా మమేకమై పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారో అర్థమవుతోంది.
వైఎస్ జగన్ ప్రకటనతో, “అన్న చెప్పాల్సింది చెప్పేశారు.. ఇక మనదే ఆలస్యం.. సిద్ధమా?” అంటూ వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తమ పోస్టులను వైరల్ చేస్తున్నారు. రాబోయే పాదయాత్రకు సంబంధించి పూర్తి షెడ్యూల్ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ యాత్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి
https://x.com/TeluguScribe/status/1939992230246154645