విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న లులూ గ్రూప్ భారీ మాల్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ భూముల కేటాయింపుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం లులూ గ్రూప్‌కు కారుచౌకగా ప్రభుత్వ భూములను అప్పగించి జేబులు నింపుకోవడానికి ప్రయత్నిస్తోందని వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
విజయవాడలోని గవర్నర్‌పేటలో ఉన్న ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలం, అలాగే విద్యాధరపురంలోని ఆర్టీసీ డిపో స్థలాన్ని లులూ సంస్థకు కేటాయించాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లు సమాచారం ఉందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం విజయవాడ పాత బస్టాండ్ స్థలం విలువ దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటుందని ఆయన అంచనా వేశారు. విద్యాధరపురంలోని ఆర్టీసీ డిపో స్థలం విలువ కూడా చాలా ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు.
ఒక కార్పొరేట్ సంస్థకు ఇంత విలువైన ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టాలన్న నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వం మరో అతిపెద్ద అవినీతి పర్వానికి తెరలేపిందని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. అసలు ఒక కార్పొరేట్ సూపర్ మార్కెట్ సంస్థకు ప్రభుత్వం విలువైన స్థలాలు కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. దేశంలో చాలా చోట్ల వాల్‌మార్ట్ మార్కెట్‌లు ఏర్పాటయ్యాయని, అవి తమంతట తాము స్థలం సేకరించుకుని, తమ సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి తప్ప, ఎక్కడా ప్రభుత్వం వారికి విలువైన స్థలాలు ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే టీడీపీ ప్రభుత్వం ఈ పని చేస్తోందని దుయ్యబట్టారు.
గతంలో విశాఖపట్నంలో లులూ గ్రూప్‌కు 13.43 ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని నామమాత్రపు లీజుకు ధారాదత్తం చేశారని, దాని విలువ ఏకంగా రూ.2 వేల కోట్లు అని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. పన్ను ప్రయోజనాలు కూడా కల్పించారని ఆయన పేర్కొన్నారు. అయితే, అప్పట్లో వచ్చిన విమర్శలతో ఆ సంస్థ వెనక్కి తగ్గిందని, ఇప్పుడు విజయవాడలో ఆర్టీసీ స్థలం ఇస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు కక్షసాధింపులు, మరోవైపు ప్రభుత్వ భూములను తన బినామీలకు కారుచౌకగా అప్పగించి, తద్వారా జేబులు నింపుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వెంకట్రామిరెడ్డి విమర్శించారు.