తెలుగు సినీ నటుడు, విద్యావేత్త మోహన్ బాబుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. విద్యార్థుల నుండి గత మూడేళ్లుగా అదనపు ఫీజులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన కమిషన్, ఆరోపణలు నిజమని తేల్చింది.
దీంతో యూనివర్సిటీపై రూ.15 లక్షల జరిమానా విధించడంతో పాటు, విద్యార్థుల నుండి వసూలు చేసిన రూ.26 కోట్ల అదనపు ఫీజును 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ పేరిట విద్యాసంస్థలను నడిపిన మోహన్ బాబు, తరువాత వాటిని మోహన్ బాబు యూనివర్సిటీగా మార్పు చేశారు. అయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.
ఇదే వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా మంచు మనోజ్ గతంలో విద్యార్థుల పక్షాన మాట్లాడిన సందర్భం ఈ పరిణామాలతో మళ్లీ చర్చనీయాంశమైంది. ఇప్పుడు కమిషన్ ఆదేశాలపై మోహన్ బాబు యూనివర్సిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.