కాకినాడ జిల్లా తునిలో జరిగిన మైనర్ బాలిక అత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిగా అరెస్టైన టీడీపీ నేత తాటిక నారాయణ రావు గురువారం ఉదయం చెరువులో మృతదేహంగా లభ్యమయ్యాడు.
బుధవారం రాత్రి కోర్టుకు తరలిస్తుండగా, పోలీసులను మూత్రవిసర్జన కోసం ఆపమని అడిగిన నారాయణ రావు, ఆ సందర్భంలోనే చెరువులోకి దూకి అదృశ్యమయ్యాడు. వెంటనే పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించగా, ఈరోజు ఉదయం అతని మృతదేహం లభ్యమైంది.
ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల మైనర్ బాలికలపై దారుణాలు పెరుగుతున్న నేపథ్యంలో, నిందితుడు రాజకీయ నాయకుడని తెలిసి మరింత ఆగ్రహం వెల్లువెత్తింది. సామాజిక మాధ్యమాల్లో “ఎర్రబుక్ రాజ్యాంగం” పేరుతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు “అంబేద్కర్ రాజ్యాంగం ఉన్నా ఇలాంటి దారుణాలు జరిగేవి కావు” అంటూ ప్రభుత్వాన్ని, రాజకీయ వ్యవస్థను తీవ్రంగా తప్పుపడుతున్నారు.
నిందితుడి ఆత్మహత్యతో కేసు ముగిసినా, తుని ప్రాంతంలో ప్రజలు బాలికకు న్యాయం జరగాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన మరోసారి సమాజంలో మహిళా భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది. రాజకీయ అనుబంధం, అధికార ప్రభావం లేకుండా న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు.