తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు కారణమైంది ABN ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ రాసిన తాజా “కొత్త పలుకు”. సాధారణంగా తనకు ఇష్టమైన నాయకులపై సుతిమెత్తగా వ్యాఖ్యలు చేసే రాధాకృష్ణ, ఈసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షుగర్ కోటెడ్ హెచ్చరిక ఇచ్చారు.
రేవంత్ ప్రభుత్వంపై గులాబీ పార్టీ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం సమాచార యుద్ధంలో వెనుకబడిపోయిందని ఆయన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల వివాదంపై ప్రభుత్వ క్యాంపు తడబడిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం వల్ల రేవంత్ ఇమేజ్ దెబ్బతిన్నదని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ప్రకటనలు ఇస్తూ మిగతావారిని దూరం చేస్తున్న ప్రభుత్వం, తానే తన కాళ్లమీద కత్తి వేసుకుంటోందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా ఆలోచించి, మంత్రులు–ఎమ్మెల్యేలతో కఠిన వైఖరి తీసుకోవాలని సూచించారు.
తనకిష్టమైన రేవంత్‌కే ఇంత తీవ్రంగా “జాగ్రత్తగా ఉండు” అని చెప్పడం రాధాకృష్ణ ఇప్పటివరకు చేయలేదు. అందుకే ఆయన ఆర్టికల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవేళ రాధాకృష్ణ రాసింది నూటికి నూరు శాతం నిజమైతే… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో పెద్ద మార్పు జరగబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


