ఏపీలోని బోగోలు మండలం పాత బిట్రగుంట గిరిజన కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో కాలనీ మొత్తం నీట మునిగిపోయి, ఇళ్లలో నీరు చేరడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
స్థానికుల ప్రకారం, తుపాను విరుచుకుపడినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వ అధికారి కాలనీకి రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, తాగునీరు, విద్యుత్ సరఫరా లేక ప్రజలు కష్టాల్లో ఉన్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
“ప్రతి టీవీ ఛానెల్‌లో పబ్లిసిటీ షోలు చేస్తూ తుపానుపై ఎలివేషన్ చూపించడమే కాకుండా, మేము ఎదుర్కొంటున్న పరిస్థితిని కూడా సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు గమనించాలి. మాకు వెంటనే సహాయం అందించాలి” అని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
వెంటనే అధికారులు స్పందించి పాత బిట్రగుంట గిరిజన కాలనీని సందర్శించి, అవసరమైన ఆహారం, వైద్య సహాయం, తాత్కాలిక నివాస ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తుపాను ప్రభావం తగ్గినప్పటికీ, మిగిలిన సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని బాధితులను ఆదుకోవాలని ప్రజల ఆకాంక్ష.


