కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సంచలన వీడియో బయటకు రావడంతో ప్రభుత్వం, అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. ఈ ఘటనలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా, గుడి ధర్మకర్త చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీశాయి.
వీడియోలో ధర్మకర్త పాండా మాట్లాడుతూ “నేనే నిన్ననే పోలీసులకు సమాచారం ఇచ్చాను. భారీగా భక్తులు వస్తారని ముందుగానే హెచ్చరించాను. కానీ పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు” అని స్పష్టంగా చెప్పారు.
ఇదే సమయంలో, మంత్రులు మరియు అధికారులు మాత్రం “ముందస్తు సమాచారం మాకు లేదు. ఆకస్మికంగా భక్తులు ఎక్కువగా రావడంతో తొక్కిసలాట జరిగింది” అని మీడియా ముందు ప్రకటించారు. అయితే, ధర్మకర్త చెప్పిన ఈ వీడియో బయటకు రావడంతో వారి మాటలన్నీ పచ్చి అబద్ధమని తేలిపోయింది.
వీడియో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. “ధర్మకర్త నిన్ననే హెచ్చరించినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?”, “భద్రతా వ్యవస్థ ఎందుకు విఫలమైంది?” అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అధికారులు ధర్మకర్తపై ఒత్తిడి తెచ్చి, “సమాచారం ఇవ్వలేదని చెప్పు” అని బలవంతపెట్టినట్లు సమాచారం. ఇది బయటకు రావడంతో అధికారుల బాధ్యతారాహిత్యం మరింత స్పష్టమవుతోంది.
మొత్తానికి, ఈ వీడియో బయటకు రావడంతో ప్రభుత్వం తడబడిపోయింది. భక్తుల ప్రాణాలకు కారణమైన ఈ నిర్లక్ష్యం పై ఎవరిపై చర్యలు తీసుకుంటారు? నిజం ఎప్పుడు బయటపడుతుంది? అన్నది చూడాలి.


