ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు ఒక పెద్ద పీఆర్ ఈవెంట్‌గా మార్చేశారన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వృద్ధుల పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని సోషల్ మీడియా షోగా, పీఆర్ డ్రామాగా మలుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా చంద్రబాబు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, ఓ వృద్ధుడి వద్దకు వెళ్లి అతని పాత హార్మోనియం పెట్టె తీసుకుని వాయించటం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. కొందరు ఈ దృశ్యాన్ని “మానవత్వం”, “స్నేహభావం”గా అభినందిస్తే, మరికొందరు మాత్రం “పాత హార్మోనియం డ్రామా” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
సూపర్ 6 హామీలు ఇంకా పూర్తిగా అమలు కాకపోయినా, చంద్రబాబు ప్రతీ నెల మొదటి తేదీని పింఛన్ ఫెస్టివల్లా నిర్వహిస్తూ కెమెరాల ముందు సీనియర్ సిటిజన్లకు డబ్బులు అందజేస్తూ పీఆర్ పండుగ చేసుకుంటున్నారని విమర్శకులు అంటున్నారు. “ఒకే టికెట్ పై రెండు డ్రామాలు – ఒకటి దోసెలు వేయడం, రెండోది హార్మోనియం పెట్టె” అంటూ ట్రోల్స్ సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తున్నాయి.
ఒకవైపు హామీల అమలు ఆలస్యం, మరోవైపు పీఆర్ ఈవెంట్లు ఈ రెండు అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చర్చల్లో ప్రధానాంశాలుగా మారాయి. ప్రజలు మాత్రం ఈ పింఛన్ డ్రామాలో “సిన్సియారిటీ” ఉందా లేక “స్క్రిప్టెడ్ షో”నా అన్నదానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు.


