తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో టిక్కెట్ పొందినా, గెలిచిన తర్వాత నుండి చిన్నికి సుఖం కనిపించడం లేదు. పార్టీలో ఆయన గౌరవం క్రమంగా తగ్గిపోతోంది.
ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు చిన్నికి మరో దెబ్బగా మారాయి. ఆయన, చిన్ని రూ.5 కోట్లకు టిక్కెట్ కొన్నారు, అతని అనుచరులు గంజాయి, లిక్కర్, మైనింగ్ అక్రమాలను నడుపుతున్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, “పేకాట డెన్ నడిపే జూదరి” అని సంబోధించడం పార్టీలో సంచలనం రేపింది.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ అధిష్ఠానం ఇద్దరినీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. వివరాలు విన్న కమిటీ ఇద్దరినీ పార్టీ విధేయులుగా పేర్కొన్నా, అధికార వర్గాలు అంతర్గత అసంతృప్తిని గమనిస్తున్నాయి.
ఇంతలో, చిన్నిపై స్వయానా అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఫిర్యాదు ఆయనకు మరింత ఇబ్బంది కలిగించింది. చిన్నికి చెందిన సంస్థలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాయని నాని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలతో టీడీపీ లో చర్చలు ముదురుతున్నాయి. ఇక ఈ ద్వంద్వ దాడుల నడుమ చిన్ని రాజకీయం ఎంత వరకు నిలబడుతుందన్నది చూడాలి.


