ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు నడిచి వెళ్లే అత్యంత పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహార విందు కలకలం రేపింది. శ్రీవారి కొండపైనా, మెట్ల మార్గంలోనూ మాంసాహారం, మద్యం వినియోగం పూర్తిగా నిషేధం అయినప్పటికీ, ఇటీవల కొందరు మెట్ల మార్గంలో బహిరంగంగా చేపల కూర/మాంసాహారం తింటూ వీడియోలకు చిక్కడం భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీరుపై, ముఖ్యంగా విజిలెన్స్ విభాగంపై భక్తులు, హిందూ ధార్మిక సంస్థల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీటీడీని నిలదీస్తున్న భక్తులు
నిషేధిత ఆహారం ఎలా తిన్నారు? పవిత్రమైన మెట్ల మార్గంలో, భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన వారు నిషేధిత మాంసాహారం తినడం ఏమిటని భక్తులు నిలదీస్తున్నారు. విజిలెన్స్ విభాగం నిద్రపోతోందా? తిరుమల పవిత్రతను కాపాడాల్సిన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం ఇటువంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి అపచారాలు జరిగినప్పటికీ, అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఇవి పునరావృతం అవుతున్నాయని మండిపడుతున్నారు.
ఛైర్మన్ గారూ.. మీ స్పందనేంటి? టీటీడీ చైర్మన్ బొల్లినేని నాయుడు గారు ఈ వరుస అపచారాలపై ఏమి సమాధానం చెప్తారని, భ్రష్టు పడుతున్న టీటీడీ పరువును కాపాడేందుకు ఏం చర్యలు తీసుకుంటారని సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై విమర్శలు పెరగడంతో టీటీడీ అధికారులు వెంటనే స్పందించారు. అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహారం తిన్న ఇద్దరు ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు రామస్వామి, సరసమ్మ విధుల్లో నుంచి తొలగించినట్లు టీటీడీ ప్రకటించింది. అంతేకాకుండా వారిపై తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ చర్య తాత్కాలికమేనా, లేక తిరుమల పవిత్రతకు భంగం కలిగించే వారికి కఠిన సందేశం ఇస్తుందా అనేది వేచి చూడాలి. టీటీడీ కేవలం ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం కాకుండా, పవిత్రతను కాపాడేందుకు విజిలెన్స్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
https://x.com/JaganannaCNCTS/status/1987787947811463504?s=20


