ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు గుంటూరులో ఉద్రిక్తతకు దారితీశాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు నేతృత్వంలో జరిగిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు బుధవారం గుంటూరులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తన నివాసం నుంచి స్వామి థియేటర్ వైపు భారీ బైక్ ర్యాలీగా బయలుదేరారు.
అయితే, ముందస్తు అనుమతి లేదనే కారణంతో స్వామి థియేటర్ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
ఈ క్రమంలోనే, పోలీసుల తీరుపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనను అడ్డుకోవడం సరికాదంటూ ఆయన పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు మరియు అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది.
సమాచారం ప్రకారం, సీఐ గంగా వెంకటేశ్వర్లు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దౌర్జన్యానికి దిగుతూ వేలు చూపిస్తూ దురుసుగా ప్రవర్తించారని, అనుచిత పదజాలం ఉపయోగించారని తెలిసింది. మాజీ మంత్రి పట్ల సీఐ వ్యవహరించిన తీరుపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే సీఐ అంబటి రాంబాబు పట్ల దురుసుగా ప్రవర్తించారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి.
https://x.com/greatandhranews/status/1988493814047404168?s=20


