సినిమా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్‌టాపిక్‌గా మారాయి. పురాణాలతో మిళితమై ఉన్న కథలను రూపొందించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా కూడా పురాణాధారిత కథతోనే ముందుకెళ్తోంది.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఈవెంట్‌లో ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “రాజమౌళి వెనుక హనుమంతుడి ఆశీర్వాదం ఉంది” అని వ్యాఖ్యానించారు. దీనిపై స్టేజ్‌పై స్పందించిన రాజమౌళి, “నేను హనుమంతుడిని నమ్మను” అని చెప్పడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇది మొదటిసారి కాదు. 2011లో వచ్చిన ఒక పాత ట్వీట్ కూడా మళ్లీ వైరల్ అవుతోంది. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఒక అభిమానికి రాజమౌళి “నాకు రాముడు కాకుండా కృష్ణుడంటే ఇష్టం” అని రిప్లై ఇచ్చిన విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు రాజమౌళిని లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. “రాముడిని నమ్మకపోతే పురాణ కథలు ఎందుకు వాడుకుంటున్నారు?” అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. భారతీయ సంస్కృతిలో రాముడి ఉన్నతమైన లక్షణాలను ప్రస్తావిస్తూ, ఒక గొప్ప వ్యక్తిని నమ్మనని చెప్పడం సరైందా అని చర్చ సాగుతోంది.
అయితే మరోవైపు, వ్యక్తిగత నమ్మకాలు వ్యక్తిగతమే, కళారూపం వేరే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దర్శకుడి నమ్మకాలు అతను చేసే సినిమాల నాణ్యతను నిర్ణయించవని వాదిస్తున్నారు.
ఏది ఏమైనా, రాజమౌళి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై వేడెక్కుతున్న చర్చకు కారణమయ్యాయి.
https://x.com/Tahir_ansari58/status/1989977949072978074?s=20

