స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2021లో తమ అధికార హవా నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ లేకుండానే విజయాలు నమోదు చేసుకున్న వైసీపీ, ఇప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ కూటమి దౌర్జన్యాలతో గెలుస్తుందని ..పులివెందులలో చేసినట్టే చేస్తుందని గ్రహించిన వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది.
2019 నుంచి 2021 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జిల్లా పరిషత్తులు అన్ని దాదాపు ఏకపక్షంగా వారి ఖాతాలోనే పడ్డాయి. కానీ అదే వైసీపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. తాజాగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకపోవడం పార్టీ ఆత్మవిశ్వాసంపై పెద్ద ప్రశ్నలు లేపింది.
వైసీపీ వర్గాల మాటలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి–జనసేన కూటమి కూడా వ్యవస్థలను ప్రభావితం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలు తప్పనిసరిగా తమపై దాడులకు దిగి అక్రమంగా గెలుస్తారని బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన వైసీపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరణ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.


