ఉప సభాపతిగా మంచి స్థానం దక్కినప్పటికీ.. రఘురామ కృష్ణరాజుకు ఆ పదవి సరిపోవడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. మంత్రి పదవి దక్కలేదన్న నిరాశ ఆయనను మరోసారి ఢిల్లీ వైపు చూడేలా చేసిందనే టాక్ వినిపిస్తోంది.
ఆయనకు కూటమి ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ ఇచ్చినప్పటికీ, అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసిన సందర్భంలోనే మంత్రిత్వం దక్కుతుందనే ఊహలు ఆయన అనుచరులు పెట్టుకున్నారు. అయితే ఆ కల నిజం కాకపోవడంతో రఘురామ వచ్చే ఎన్నికలకు ముందే తన తదుపరి రాజకీయ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఆయన చూపు పూర్తిగా 2029 పార్లమెంట్ ఎన్నికలపైనే. నరసాపురం నుంచి మళ్లీ ఎంపీగా బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఢిల్లీలో తనకున్న పరిచయాలు, బీజేపీ పెద్దలతో ఉన్న సంబంధాలు తనకు కేంద్ర రాజకీయాల్లో స్థిరమైన స్థానం ఇస్తాయనే నమ్మకం ఆయనకు ఉందని అంటున్నారు.
అయితే ఇదంతా అంత సులభం కాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే నరసాపురం నుంచి ప్రస్తుత కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మళ్లీ బరిలో ఉంటారనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ కూడా గెలిచిన సీట్లను వదులుకునే పరిస్థితిలో లేని నేపథ్యంలో, ఈ సీటు కోసం రఘురామకు కఠిన పోటీ తప్పదని చెబుతున్నారు.
మరోవైపు రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి అసెంబ్లీ సీటుపై కూడా పోటీ రగిలే అవకాశాలు ఉన్నాయి. గతసారి త్యాగం చేసిన మంతెన రామరాజు మళ్లీ అసెంబ్లీ బరిలోకి రావడం ఖాయం. జనసేన కూడా ఈ సీటు పై దృష్టి పెట్టిన నేపథ్యంలో పరిస్థితులు మరింత క్లిష్టం కానున్నాయి.
ఈ నేపథ్యంలో రఘురామ 2029లో ఎంపీ సీటునే లక్ష్యంగా పెట్టుకుని పని ప్రారంభించినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆయన తాకట్టు చర్యలు మొదలు పెట్టారని తెలుస్తోంది.
ఇక చూడాలి మరి… ఈ ప్రచారం రాజకీయ వాస్తవాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో!


