ఇజ్రాయెల్ అంటే గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు ఐరన్ డోమ్ . శత్రువుల రాకెట్ దాడుల నుంచి దేశాన్ని కాపాడిన ఈ వ్యవస్థ ఇటీవల జరిగిన దాడుల్లోని కొన్ని లోపాలను ప్రపంచానికి చూపింది. అయితే, ఇజ్రాయెల్ ఇప్పుడు ఐరన్ డోమ్‌కు మించిన, విప్లవాత్మకమైన గగనతల రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. అదే ‘ఐరన్ బీమ్’
ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థకు తోడుగా, అతి తక్కువ ఖర్చుతో పనిచేసే ఈ లేజర్ వ్యవస్థను ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. దీనిని ఇజ్రాయెల్ రక్షణ శాఖలోని పరిశోధన అభివృద్ధి విభాగం చీఫ్ బ్రిగేడియర్ డేనియల్ గోల్డ్ ధ్రువీకరించారు. “ఐరన్ బీమ్ వ్యవస్థ అభివృద్ధి పూర్తయింది. డిసెంబర్ 30న దీనిని ఇజ్రాయెల్ మిలిటరీ విభాగానికి అందిస్తాం” అని ఆయన ప్రకటించారు.
‘ఐరన్ బీమ్’ అనేది భూ ఆధారిత హై-పవర్ లేజర్ వైమానిక రక్షణ వ్యవస్థ. ఇది రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లు వంటి స్వల్ప శ్రేణి వైమానిక ముప్పులను అడ్డుకోవడానికి రూపొందించబడింది.
ఐరన్ డోమ్ ఇంటర్‌సెప్టర్ క్షిపణి ధర సుమారు $40,000 నుండి $80,000 వరకు ఉండగా, ఐరన్ బీమ్ ఒక్కసారి ఫైర్ చేయడానికి అయ్యే ఖర్చు కేవలం $2 నుండి $10 మాత్రమే ఉంటుందని అంచనా. అంటే, దాదాపుగా సున్నా నిర్వహణ వ్యయంతో ఇది పనిచేస్తుంది. దీనికి క్షిపణుల మాదిరిగా పరిమిత సంఖ్య ఉండదు. విద్యుత్ సరఫరా ఉన్నంత వరకు ఇది పనిచేస్తూనే ఉంటుంది. లేజర్ కాంతి వేగంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది, దాడిని దాదాపు తక్షణమే నిలుపుదల చేస్తుంది.
ఈ అత్యాధునిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్‌కు దశాబ్ద కాలం పట్టింది. ఈ వ్యవస్థ యుద్ధరంగంలో పోరాటాన్ని పూర్తిగా మార్చేస్తుందని, భవిష్యత్తులో దేశ రక్షణకు తిరుగులేని కవచంగా నిలుస్తుందని ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల కాలంలో దీని చిన్న వెర్షన్‌లను ఉపయోగించగా, అవి డజన్ల కొద్దీ లక్ష్యాలను విజయవంతంగా అడ్డుకున్నాయి. ఐరన్ డోమ్ బలమైన వ్యవస్థకు ఇప్పుడు ‘ఐరన్ బీమ్’ అతి తక్కువ ఖర్చుతో కూడిన అదనపు బలంగా జత చేరింది.


