ఆంధ్రప్రదేశ్‌లో 2029 ఎన్నికల దిశగా వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ మళ్లీ హాట్‌టాపిక్‌గా మారారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్న జగన్.. తాడేపల్లిలో వారంలో కొన్ని రోజులు మాత్రమే ఉండటం పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైందని సమాచారం. అయితే ఇటీవలి రోజులుగా ఆయన తాడేపల్లికి వచ్చిన ప్రతీసారి సమావేశాలు, మీడియా మీట్లకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిస్తున్నారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే జాతీయ మీడియాలో జగన్‌కు ఉన్న ప్రత్యేక సంబంధం ఇప్పటికీ చర్చనీయాంశమే. గత ఎన్నికల ముందు వైసీపీకి అనుకూల ఫలితాలు చూపించిన నేషనల్ మీడియా ఛానళ్ల ప్రతినిధులు మళ్లీ బెంగళూరు ప్యాలెస్‌కు వరుసగా వెళ్లిపోతున్నారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.
ఇదే ప్రచారానికి బలం చేకూరుస్తూ— త్వరలో వైసీపీకి అనుకూలంగా సర్వేలు బయటకు రావొచ్చని, 2029 ఎన్నికల వేదిక సిద్ధం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో రెండు సంవత్సరాల కూటమి పాలనపై ప్రతికూలత ఉంది. దీన్నే నేషనల్ మీడియా హైలెట్ చేసింది. దీంతో పాటు వైసీపీ పనితీరు మెరుగైందంటూ సర్వేలు వచ్చాయి. దీంతో నేషనల్ మీడియాను ఏపీలోకి దించి సర్వేలు ప్రచురించి ప్రజల్లో కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్ ను చూపించాలని జగన్ ప్లాన్ చేసినట్టు సమాచారం.
మొత్తం మీద 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే.. జగన్ బెంగళూరు ప్రచారం, నేషనల్ మీడియా కదలికలు, కొత్త వ్యూహాలు ఏపీ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠను రేపుతున్నాయి.


