భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు క్షుద్రపూజలు చేస్తున్నాడంటూ గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఎన్నికల్లో గెలుపు కోసం, అలాగే డబ్బు సంపాదనే లక్ష్యంగా నాగరాజు మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అన్నం రాసులపై మాంసం, రక్త తర్పణాలు చేస్తూ గాల్లోకి నిమ్మకాయను లేపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను చూసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గిరిజన మహిళలు, యువతపై ఈ క్షుద్రపూజల ప్రభావం పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కుటుంబాలు ఇప్పటికే గ్రామాన్ని వదిలి వెళ్లే పరిస్థితి కూడా నెలకొందని సమాచారం.
నాగరాజు ఈ క్షుద్రపూజల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నాడని, ప్రజల్లో భయాలు సృష్టిస్తూ మూఢనమ్మకాలను వ్యాపింపజేస్తున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని, నాగరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై అధికారుల స్పందన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి మూఢనమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు.


