వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవికి ఊహించని నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మయ్యగారిపల్లి గ్రామంలో వైఎస్ఆర్‌సిపి నుండి టిడిపిలోకి మారుతున్న మూడు కుటుంబాలకు కండువా కప్పేందుకు బీటెక్ రవి వెళ్లగా, గ్రామంలోని మెజారిటీ ప్రజలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు.
బీటెక్ రవి గ్రామంలో అడుగుపెట్టక ముందే, ఊరు మొత్తం ఇళ్లకు తాళాలు వేసి గ్రామస్తులంతా ఊరు వదిలి వెళ్ళిపోవడం చర్చనీయాంశమైంది. గ్రామంలోని ఎక్కడికక్కడ ఖాళీగా కనిపించిన ఇళ్లు, వీధులు చూసి తెలుగుదేశం నాయకులు సైతం ఆశ్చర్యపోయారు.
వైఎస్ఆర్ హయం నుండి తమ గ్రామం వైఎస్ కుటుంబం వెంటే నడుస్తోందని, తెలుగుదేశం పార్టీ ఊరిలో అడుగు పెట్టడంతోనే తాము ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చిందని కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు తమను ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
ఈ పరిణామంపై వైఎస్ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలోకి రావడంతోనే ఊరు మొత్తం ఖాళీ అయిందని, ఇళ్లకు తాళాలు వేసి అమ్మయ్యగారిపల్లి గ్రామస్తులు వైఎస్సార్ పార్టీకి తమ మద్దతును గట్టిగా ప్రకటించారని ఆయన అన్నారు.
“అమ్మయ్యగారిపల్లి గ్రామస్తులు ఇచ్చిన ఈ స్ఫూర్తి వైఎస్ఆర్సిపికి వెయ్యి ఏనుగుల బలం,” అని సతీష్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని ఈ సంఘటన నిరూపిస్తోందన్నారు.
ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటే, తెలుగుదేశం నాయకులు మాత్రం పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా అమ్మయ్యగారిపల్లె గ్రామస్తులు గొప్ప తెగువ చూపించారని సతీష్ కుమార్ రెడ్డి కొనియాడారు.
పులివెందుల వంటి కంచుకోటలో తాము పార్టీ మారడం లేదని గ్రామస్తులు తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.


