భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో అనుబంధ సంఘాల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ నుంచి విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ వరకు పార్టీకి ఒక క్రమశిక్షణాత్మక నిర్మాణం ఉంది. అదే సంస్కృతిని జనసేనలోనూ నెలకొల్పాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది.
పదవులు అంటే దర్పం కాదు, బాధ్యత అని పవన్ పదే పదే చెబుతున్నారు. అందుకే ఈ నెల 22న జనసేన ద్వారా పదవులు పొందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, నామినేటెడ్ పదవుల నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండటం, పార్టీపై చిత్తశుద్ధితో పనిచేయడం ప్రధాన లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు.
దాదాపు పదేళ్ల పాటు పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన జనసేన ఇకపై మరింత బాధ్యతగా వ్యవహరించాలని పవన్ భావిస్తున్నారు. వ్యక్తిగత ఆరాధనకన్నా పార్టీ నిర్మాణం బలపడాలన్నదే ఆయన లక్ష్యం. ఒక మాటలో చెప్పాలంటే, బీజేపీ తరహా వ్యవస్థను జనసేనలో అమలు చేయాలన్న ప్రయత్నంగా ఈ చర్యలు కనిపిస్తున్నాయి.

