విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ ప్రాంతంలో ఎకరా భూమిని కేవలం 99 పైసలకే రియల్ ఎస్టేట్ కంపెనీకి కేటాయించడంపై కూటమి ప్రభుత్వం తీవ్ర విమర్శలపాలైంది. 27 ఎకరాలకు పైగా భూమిని రహేజా కార్ప్‌కు అప్పగించాలన్న నిర్ణయంపై హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కీలక ప్రశ్నలు సంధించింది. ఇంత తక్కువ ధరకు, అది కూడా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు ఇవ్వడం రాష్ట్ర ప్రయోజనాలకు ఎలా దోహదపడుతుందో వివరించాలని కోర్టు నిలదీసింది.
ఈ వ్యవహారం కోర్టులో చిక్కుల్లో పడటంతో మంత్రి నారా లోకేష్ రాజకీయ విమర్శలకు దిగారు. పెట్టుబడులు, ఉద్యోగాలను వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. కానీ అసలు ప్రశ్నలు వేయాల్సింది ప్రతిపక్షాన్ని కాదు, కోర్టు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూకేటాయింపుతో పాటు ప్రభుత్వమే కంపెనీకి కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఉండటంపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి.
యువత ఉద్యోగాల పేరుతో కారుచౌకగా విలువైన భూములు కార్పొరేట్లకు అప్పగించడం సమంజసమేనా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజకీయ విమర్శలకన్నా కోర్టులో ప్రభుత్వ వాదనలను బలంగా వినిపించి, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత లోకేష్‌పైనే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

