ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన మూడు నెలలకే పాలనపై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలి ప్రభుత్వం మొత్తానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందనే చర్చ సర్వత్రా సాగుతోంది.
పాలనలో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రికి, సొంత పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలు తలనొప్పిగా మారాయి. కొందరు ఎమ్మెల్యేలపై సీఎంకు కంట్రోల్ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలో, నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం కేడర్‌ను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.కొందరు ఎమ్మెల్యేలు ఇసుక రీచ్‌లపై పట్టు సాధించి, అనధికారికంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మద్యం వ్యాపారంలో పాత సిండికేట్లతో చేతులు కలిపి, కొత్త పాలసీలోనూ తమ వాటా కోసం కొందరు నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం స్కామ్ వెలుగులోకి రావడం ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చింది.
కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. కానీ, నేటికీ గంజాయి రవాణా అదుపులోకి రాకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే స్వయంగా పేకాట క్లబ్లను ప్రోత్సహిస్తూ, దగ్గరుండి నడిపిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో భూవివాదాల్లో సొంత కూటమి నేతలే తలదూరుస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగానే హెచ్చరించడం సంచలనం సృష్టించింది.
“భీమవరం డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించినా, ఇప్పటికీ ఆయనపై ఎలాంటి యాక్షన్ లేకపోవడం గమనార్హం. ఇది ప్రభుత్వంలో సమన్వయ లోపాన్ని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.”
ప్రజలు భారీ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టింది వ్యవస్థల్లో మార్పు వస్తుందనే ఆశతోనే. కానీ, ఎమ్మెల్యేలు పాత పద్ధతులనే అనుసరిస్తే.. అది రాబోయే రోజుల్లో కూటమి భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధిష్టానం కఠిన చర్యలు తీసుకోకపోతే, ప్రజల్లో వస్తున్న ఈ చిన్న అసంతృప్తి.. పెద్ద సెగగా మారక తప్పదు.


