ప్రధాని నరేంద్ర మోడీ రిటైర్‌మెంట్ తర్వాత దేశానికి ఎవరు ప్రధాని అవుతారనే అంశంపై ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనం ప్రచురించిందంటూ ఇటీవలి రోజుల్లో తెలుగు మీడియా హడావుడి చేసింది. ఆ కథనంలో మోడీ తర్వాతి రాజకీయ పరిణామాలపై ఊహాగానాలు మాత్రమే ఉన్నప్పటికీ, కొన్ని వర్గాలు వాటిని అతి ప్రచారంగా మార్చేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాయిటర్స్ కథనాన్ని ఆధారంగా చేసుకుని, మోడీ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ లే భవిష్యత్ ప్రధానులని అన్నట్టు తెలుగు ‘ఎల్లో మీడియా’ బలంగా ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ అంశాన్ని అతి అతిశయంగా తీసుకెళ్లిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌లో లైవ్ డిబేట్ నిర్వహించిన యాంకర్ వెంకటకృష్ణ వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. చంద్రబాబును ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు “చంద్రబాబు ఓ ఐకాన్. తెలుగు ప్రజలకు ఐకాన్. ఆంధ్రప్రదేశ్‌కు ఐకాన్. ఎవరు పెట్టుబడిదారులు వచ్చినా చంద్రబాబునే చూసి వస్తారు. కాబట్టి కాబోయే ప్రధాని అనడంలో ఎలాంటి సందేహం లేదు” అని చెప్పడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వాస్తవానికి రాయిటర్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు భవిష్యత్ రాజకీయాలపై విశ్లేషణలు, సంభావ్య పేర్లను మాత్రమే ప్రస్తావిస్తాయి తప్ప, “ఇతడే ప్రధాని” అని తేల్చి చెప్పవు. కానీ ఆ కథనాన్ని వక్రీకరించి, వ్యక్తిగత ఆరాధన స్థాయికి తీసుకెళ్లడం మీడియా నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ విశ్లేషణ అనేది వాస్తవాల ఆధారంగా ఉండాలా? లేక అభిమానంతో హద్దులు దాటాలా? అన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
మొత్తానికి, రాయిటర్స్ కథనాన్ని అతి చేసి చూపించిన తీరు, ఏబీఎన్ డిబేట్‌లో వినిపించిన ప్రశంసలు ఇవన్నీ కలిపి తెలుగు మీడియా విశ్వసనీయతపై మరోసారి పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి.

