వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం తన స్వస్థలం పులివెందులలో అడుగుపెట్టడంతో పట్టణం మొత్తం ఉత్సాహంతో ఉప్పొంగింది. జగన్ ఎంట్రీతోనే జనసంద్రం కదిలింది. రోడ్లన్నీ అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయాయి. “జగన్.. జగన్..” నినాదాలతో పులివెందుల వాతావరణం కంపించింది.
ఈ సందర్భంగా కడప నూతన మేయర్ పాకా సురేష్ జగన్‌ను కలుసుకుని శుభాకాంక్షలు అందించారు. నూతన మేయర్‌ను జగన్ హృదయపూర్వకంగా అభినందించారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా జగన్‌ను కలిసి పర్యటనకు స్వాగతం పలికారు. ఈ భేటీలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పులివెందుల చేరుకున్న అనంతరం జగన్ భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి ప్రత్యక్షంగా సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
రేపు బుధవారం (డిసెంబర్ 24) ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్‌లో నిర్వహించే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్‌లో మరోసారి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఆ రాత్రి కూడా అక్కడే బస చేస్తారు.
గురువారం డిసెంబర్ 25 ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు. వరుస కార్యక్రమాలతో మూడు రోజులపాటు పులివెందుల రాజకీయ వాతావరణం హీట్ ఎక్కనుంది.
మొత్తానికి జగన్ పులివెందుల ఎంట్రీ మరోసారి తన పట్టు ఏమిటో చూపించింది. నాయకుడు వస్తే ఇలా ఉండాలి అంటూ అభిమానులు షేకింగ్ వీడియోలతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.

