పులివెందులలో క్రిస్మస్ వేడుకలు వైయస్ కుటుంబంలో మరోసారి ఆసక్తికర చర్చకు దారితీశాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి పులివెందుల పర్యటనలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే ఆ ఫోటోలో జగన్ సోదరి వైయస్ షర్మిల కనిపించకపోయినా, ఆమె కుమారుడు మాత్రం భారతి రెడ్డి పక్కన కూర్చుని ఫోజులివ్వడం విశేషంగా మారింది. దీంతో జగన్–షర్మిల మధ్య విభేదాలు సద్దుమణిగే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.
గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసు తదితర పరిణామాలతో కుటుంబంలో చీలిక స్పష్టంగా కనిపించినా, ఇటీవల జగన్ జన్మదినం సందర్భంగా షర్మిల శుభాకాంక్షలు చెప్పడం, ఇప్పుడు ఆమె కుమారుడు కుటుంబ వేడుకల్లో కనిపించడం కొత్త సంకేతంగా భావిస్తున్నారు. రానున్న రోజుల్లో వైయస్ కుటుంబంలో సమీకరణాలు మారతాయా? అన్నది వేచి చూడాల్సిందే.


