తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
“మా అయ్య మొగోడు, మొనగాడు.. తెలంగాణ తెచ్చినోడు. బారాబర్ మా అయ్య పేరు చెప్పుకుంటాను. నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చా పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పడు” అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తీవ్ర కౌంటర్ గా మారాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ పరోక్షంగా ఫైర్ అయ్యారు. సీఎం హోదాలో ఉండి కూడా దిగజారిన భాషను ఉపయోగిస్తున్నారని, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని కేటీఆర్ మండిపడ్డారు. ఇటీవల కేటీఆర్‌పై “నీ అవ్వ..” అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై రాజకీయంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఈ వివాదానికి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు హుందాగా ఉండాలని, సంస్కృతి సభ్యతల్ని మరిచి మాట్లాడటం తెలంగాణ సమాజం ఒప్పుకోదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పోరాడిన నాయకులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
మొత్తంగా చూస్తే.. మాటల స్థాయిని దాటి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లిన ఈ రాజకీయ యుద్ధం, రాబోయే రోజుల్లో మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన రాజకీయాలు, వ్యక్తిగత విమర్శల దిశగా వెళ్లడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


