కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఎమ్మెల్యే భరత్‌రెడ్డికి సన్నిహితుడిగా చెప్పబడుతున్న సతీష్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి గన్‌మన్ తుపాకీని లాక్కుని రెండు రౌండ్లు కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాలి జనార్దన్‌రెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పరస్పర కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, సతీష్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటన అనంతరం బళ్లారిలో భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు. కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

