వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను అసహనానికి గురిచేస్తున్నాయా? ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిన్న సంఘటన జరిగినా వెంటనే వైరల్ చేస్తున్నారని, కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పవన్ ఆరోపించారు.
సోషల్ మీడియా నిలదీతలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించిన పవన్, అవసరమైతే పోలీస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించడం గమనార్హం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే నేరమా? అనే ప్రశ్నను వైసీపీ నెటిజన్లు లేవనెత్తుతున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే బెదిరింపులేనా? అని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతోంది.
ప్రత్యేకంగా పిఠాపురం పేరు ప్రస్తావిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. “పిఠాపురం వచ్చి గొడవలు చేస్తామంటే ఊరుకోను”, “నా మాటలు మెత్తగా ఉంటాయి గానీ చేతలు చాలా గట్టిగా ఉంటాయి” అంటూ చేసిన వ్యాఖ్యలు అధికార అహంకారానికి నిదర్శనమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెడితే చూస్తూ ఊరుకోనని, మొత్తం ఏరిపారేస్తానంటూ చెప్పడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైసీపీ సోషల్ మీడియా మాత్రం పవన్ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ప్రజల సమస్యలు, హామీల అమలు, పాలనలో లోపాలపై ప్రశ్నలు వేయడం తమ హక్కు అని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన నాయకులు బెదిరింపులకు దిగడం సరైంది కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తానికి, సోషల్ మీడియా యుగంలో ప్రజల ప్రశ్నలు తప్పవు. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులదే. విమర్శలను భరించలేక బెదిరింపులు చేయడం రాజకీయంగా ఎంతవరకు సమంజసం? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.
https://x.com/greatandhranews/status/2009533488769454534?s=20


