ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు అదే అమరావతిని “అవకాయ అమరావతి”గా మార్చి ప్రజల ముందు సెటైర్‌కు గురవుతున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పిన మాటలు, నేడు ఆవకాయ–అప్పడం ప్రోగ్రాంల వరకు పరిమితమవడం చూస్తుంటే ప్రజలకు నవ్వు రావడం కంటే ఆవేదన ఎక్కువగా కలుగుతోంది.
ప్రపంచానికి అమరావతిని పరిచయం చేస్తామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ‘అవకాయ అమరావతి ఫెస్టివల్’ పేరుతో సిల్లీ ఈవెంట్లకు శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలకు దారి తీసింది. “నాట్ ఓన్లీ అవకాయ, వెరీ హాట్” అంటూ చేసే వ్యాఖ్యలు వినోదంగా ఉన్నప్పటికీ, రాజధాని స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అమరావతిని సింగపూర్, లండన్‌లతో పోల్చి చూపించిన రోజులు గుర్తు చేసుకుంటే, ఇప్పుడు ఆవకాయ బ్రాండ్‌గా మార్చడం ప్రజలకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. రాజధాని అంటే ఆర్థిక కేంద్రం, పరిపాలనా హబ్, ఉపాధి అవకాశాల కేంద్రం కావాలి. కానీ ఇక్కడ మాత్రం ఆవకాయ, అప్పడం, పచ్చడుల చుట్టూనే కథ తిరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైతులు భూములు ఇచ్చి ఎదురు చూసిన అభివృద్ధి ఎక్కడ? యువతకు ఉద్యోగాలు ఎక్కడ? మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాలు, అంతర్జాతీయ పెట్టుబడులు ఎక్కడ అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, ఉత్సవాల పేరుతో కాలక్షేపం చేయడం ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నట్టు కనిపిస్తోంది.
సెటైర్ చేస్తే పరవాలేదు. కానీ రాజధాని గౌరవాన్ని తగ్గించేలా, ప్రజల ఆశల్ని పరిహాసంగా మార్చేలా ఉంటే మాత్రం అది పాలకులకే పరువు నష్టం. అంతర్జాతీయ రాజధాని అమరావతిగా చెప్పి, చివరకు అవకాయ అమరావతిగా ముద్ర పడితే, చరిత్రలో అది ఒక విచిత్ర అధ్యాయంగా మిగిలిపోతుంది.
అమరావతికి కావాల్సింది ఫెస్టివల్స్ కాదు… దృఢమైన ప్రణాళికలు, స్పష్టమైన అభివృద్ధి, ప్రజల నమ్మకం. అది లేకపోతే “అవకాయ అమరావతి” అనే సెటైర్ ఇంకా బలంగా మారడం ఖాయం.


