ఆంధ్రప్రదేశ్‌లో గత 18 నెలల్లో 20 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించామని సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి, బడ్జెట్‌కు నిధుల కొరతతో సతమతమవుతున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడం వాస్తవ విరుద్ధమని విపక్షాలు, నిపుణులు విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలో జీతాలు, పెన్షన్ల చెల్లింపులకే ఇబ్బందులు ఎదురవుతున్న వేళ, కోట్లతో ఉద్యోగాలను కొలవడం ప్రజలను అయోమయంలో పడేసిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. “ఉద్యోగాలు అంటే సంఖ్య ఉండాలి, రంగాలు ఉండాలి, కాలపరిమితి ఉండాలి. కానీ ‘కోట్ల ఉద్యోగాలు’ అన్న మాట ఆర్థిక శాస్త్రానికి సరిపోదు” అని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
లెక్కలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సీఎం చేసిన ప్రకటనపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఉద్యోగాలు ఎంతమందికి కల్పించారు? ఏ రంగాల్లో ఉద్యోగాలు వచ్చాయి? ప్రభుత్వ రంగమా? ప్రైవేట్ రంగమా? శాశ్వత ఉద్యోగాలా? తాత్కాలికమా? ఇలాంటి వివరాలేవీ వెల్లడించకపోవడం విమర్శలకు దారితీసింది. పెట్టుబడుల విషయమైతే, ఎక్కడి నుంచి ఎంత పెట్టుబడి వచ్చింది? ఏ ప్రాజెక్టుల్లో అమలైంది? అన్న ప్రశ్నలకు స్పష్టత లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
జాతీయ మీడియా ముందు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిసినప్పటికీ, అతిశయోక్తులతో కూడిన ప్రకటనలు చేయడం వల్ల రాష్ట్రంపై నమ్మకం తగ్గుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రజలు కోరేది గొప్ప మాటలు కాదని, వాస్తవ ఫలితాలేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యోగాలపై స్పష్టమైన గణాంకాలు, పెట్టుబడులపై పారదర్శకత, ఆర్థిక నిర్వహణలో బాధ్యత—ఇవే అవసరమని పేర్కొంటున్నారు.
ఇకపోతే సీఎం వ్యాఖ్యలపై ప్రభుత్వం నుంచి ఇంకా వివరణ రాకపోవడంతో, “20 లక్షల కోట్ల ఉద్యోగాలు” అన్న ప్రకటనపై చర్చ మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

