డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించకుండా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ఇక్కడి ప్రజలు వినే స్థితిలో లేరని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఒక రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం రాజకీయ పరిపక్వతకు నిదర్శనం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే సందర్భంలో బీజేపీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను ఆశ్రయించుకునే స్థితిలో తెలంగాణ బీజేపీ ఉందని, అది భిక్షాందేహి రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు. కులం, మతం పేరిట ప్రజలను మోసం చేయాలని బీజేపీ ప్రయత్నించినా తెలంగాణ ప్రజలు అటువంటి మాయలకు లోనుకావరని తేల్చిచెప్పారు.
“పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ లో చేసుకోండి. తెలంగాణలో కాదు” అని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా హెచ్చరించారు. తెలంగాణలో రాజకీయం చేయాలంటే ముందు ఇక్కడి ప్రజల చరిత్ర, ఉద్యమ స్పూర్తి, ఆత్మగౌరవాన్ని గౌరవించాలని సూచించారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదానికి దారి తీసినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

