ఏలూరు జిల్లాలో జనసేన పార్టీకి షాక్ ఇచ్చేలా ఉంగుటూరు మండల అధ్యక్షుడు పంది రాంబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వంతో పాటు మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధికారంలోకి రావడానికి తాను శక్తికి మించి పనిచేశానని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు, జిల్లా అధ్యక్షుడికి పంపించిన రాంబాబు, అనంతరం ఉంగుటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తనను ఎప్పుడూ గౌరవంగా చూడలేదని, పలుమార్లు తనకు తెలియకుండా పార్టీ సమావేశాలు నిర్వహించారని ఆరోపించారు.
మండల అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తనను చిన్నచూపు చూసేవారని, కార్యకర్తల ముందే అవమానించారని వాపోయారు. ఎమ్మెల్యే ధర్మరాజు వద్ద ఉన్నత వర్గాలు, ధనికులకు మాత్రమే ప్రాధాన్యత ఉందని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఆయనతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.


