హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి. మార్కెట్లో అదే నెయ్యి కిలోకు సుమారు రూ.560కు లభిస్తుండగా.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి మాత్రం అదే నెయ్యిని రూ.658 చొప్పున సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ అంశంపై వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “టీటీడీకి రూ.658కు సరఫరా చేస్తున్న నెయ్యి స్వచ్ఛమైనదే అయితే.. మార్కెట్లో రూ.560కు దొరికేది కల్తీ నెయ్యినా?” అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ ధరల వ్యత్యాసంపై సమగ్ర విచారణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే టీటీడీ నెయ్యి సరఫరాలపై సుప్రీంకోర్టులో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ సరైనదేనని బొత్స వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం వెనుక అసలు నిజాలు బయటపడాలని.. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
టీటీడీ లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై గతంలో కూడా వివాదాలు తలెత్తిన నేపథ్యంలో తాజా ధరల చర్చ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.
మొత్తానికి టీటీడీ నెయ్యి కొనుగోళ్లలో ధరల వ్యత్యాసం నిజంగా ఏం సూచిస్తోంది? నాణ్యతా ప్రమాణాలా, లేక వేరే కారణాలా అన్నది విచారణ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

