రెండేళ్ల క్రితం వరకూ సుగాలి ప్రీతి కేసు న్యాయం కోసం గొంతెత్తిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు సీబీఐ ఆ కేసును పక్కన పెట్టిన తర్వాత మౌనంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సుగాలి ప్రీతి అనే 14 ఏళ్ల గిరిజన బాలిక 2017లో అమానుషంగా హత్యకు గురైంది. ఆ సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ కేసుపై సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై గట్టిగా స్పందించి, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.
2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రీతి కేసును సీబీఐకి అప్పగించారు. అంతేకాకుండా, ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల ఆర్థిక సహాయం, 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు నాటి సీఎం వైఎస్ జగన్..
సీబీఐ విచారణలో నిర్ధారిత ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును పక్కనపెట్టింది. అయితే, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే ఈ కేసుపై ఎలాంటి చర్చ లేకుండా, దానిని పూర్తిగా మర్చిపోయేలా చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే జనసేన-టీడీపీ కూటమి ఏర్పడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడా కేసుపై స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అప్పట్లో ఈ కేసును న్యాయం కోసం పోరాడిన పవన్, ఇప్పుడు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. “అప్పట్లో నువ్వు పోరాడినంతగా, ఇప్పుడు కూడా న్యాయం కోసం మాట్లాడతావా?” అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.
సుగాలి ప్రీతి కేసు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ స్వలాభాల కోసం ఈ కేసును వాడుకున్నవారు ఇప్పుడు మౌనంగా ఉండటం ఏ విధంగా సమర్థనీయమో? పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందిస్తారా? లేదా? అనేది చూడాలి.
సుగాలి ప్రీతిని రాజకీయంగా వాడుకొని ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్. ఇప్పుడు వెళ్లి సీబీఐ మెట్లు కడుగుతావా లేక సుగాలి ప్రీతి కుటుంబం కాళ్ళ పట్టుకొని క్షమాపణ కోరుతావా పవన్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.