కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో టీడీపీ ట్రూత్ బాంబులు, టైమ్ బాంబుల కల్చర్ ను ముందుకు తెచ్చింది. 2023 అక్టోబర్ 23న టీడీపీ సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేసింది – ‘‘రేపు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్‌పోజ్… కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 పీఎం’’. ఈ పోస్టు వైరల్ కావడంతో, వైసీపీ కూడా అదే సమయంలో ‘‘బ్లాస్టింగ్ న్యూస్ రిలీజ్’’ చేస్తామని ప్రకటించింది. దీంతో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర పోటీ నెలకొంది.
తాజాగా, అదే ధోరణిలో వల్లభనేని వంశీ ఎపిసోడ్‌పై వైసీపీ ‘‘ట్రూత్ బాంబు’’ పేల్చుతామని నిన్న ప్రకటించింది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కేసులో వైసీపీ ఏం వెల్లడిస్తుందో అన్న ఆసక్తి పెరిగింది. అయితే, అందరికీ ఇప్పటికే తెలిసిన సత్యవర్థన్ వాంగ్మూలాన్ని బయటపెట్టడంతో, వైసీపీ అనుచరులు నిరాశ చెందారని తెలుస్తోంది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటూ, సత్యవర్థన్ గతంలో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. అయితే, బెదిరింపుల కారణంగా ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడని పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వారం రోజులుగా ఈ అంశంపై చర్చ కొనసాగుతున్నా, వైసీపీ కొత్తగా ఏమీ వెల్లడించకుండా పాత విషయాన్నే మరోసారి చెప్పడంతో, వారి అనుచరులు కూడా నిరుత్సాహానికి గురయ్యారని చెబుతున్నారు.