Singer Kalpana : సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం: వైరల్ వీడియో

Singer Kalpana : ప్రముఖ గాయని కల్పన రాఘవేందర్ ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. గత రెండు దశాబ్దాలుగా చిత్రసీమలో సింగర్‌గా నిలిచిన కల్పన, అనేక హిట్ పాటలు పాడి పేరు సంపాదించారు. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళ భాషల్లో పాటలు ఆలపించారు. చెన్నైలో జన్మించిన కల్పన చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు.

కల్పన బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఆ షోలో ఆమె 4వ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. టెలివిజన్ షోలలో జడ్జిగా కూడా వ్యవహరించిన ఆమె, కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించారు. అయితే, వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వివాహ జీవితం సవ్యంగా సాగక, భర్తతో మనస్పర్థలు ఏర్పడడంతో విడాకులు తీసుకున్నారు. ఆమె కుమార్తె తన వద్దనే పెరుగుతోంది.

సింగిల్ పేరెంట్‌గా జీవనం సాగించడంలో కల్పన పలు సవాళ్లను ఎదుర్కొన్నట్లు గతంలో వెల్లడించారు. షోలు, ఈవెంట్లతో బిజీగా ఉండటంతో కూతురిని బంధువుల వద్ద ఉంచాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒంటరిగా ఉంటున్న కల్పన రెండు రోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో ఇంటి వెనుక డోర్‌ను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులు, ఆమెను అపస్మారక స్థితిలో కనుగొన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, నిద్ర మాత్రలు మింగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది.

కల్పన భర్త చెన్నైలో ఉన్నట్లు సమాచారం. ఘటన తెలిసిన వెంటనే ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కల్పన త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.