‘కొత్త పలుకు’లో బీఆర్ఎస్ తెలంగాణ జాగీరా అంటూ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ రాసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాసం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపింది.
రాధాకృష్ణ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు సుమారు 50 బెటాలియన్ల పోలీసులు, ఏబీఎన్ కార్యాలయం ముందు 70 మంది పోలీసులతో కూడిన బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నాయకులు కార్యాలయాల వద్దకు చేరుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాధాకృష్ణ ‘కొత్తపలుకు’ కథనంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణను, బీఆర్ఎస్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ, రాజకీయ విమర్శల పరిమితులపై చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ఉద్రిక్తత కొనసాగుతోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి