ఈనెల 9వ తారీఖున చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలంలోని మార్కెట్ యార్డ్ నందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, జగన్ అన్న రాక నేపథ్యంలో హెలిప్యాడ్ కు కేటాయించిన స్థలంలో పనులు అత్యంత చురుగ్గా మొదలయ్యాయి.
కూటమి ప్రభుత్వంలో దగాపడ్డ రైతులకు భరోసా కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన చేపడుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు వారికి సంఘీభావం తెలపడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
జగన్ పర్యటన అంటే ఆ మాత్రం హడావిడి ఉండాల్సిందేనని స్థానిక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా చెబుతున్నారు. హెలిప్యాడ్ నిర్మాణం నుంచి సభా ప్రాంగణం ఏర్పాటు వరకు అన్ని పనులను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా రైతులు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జగన్ ప్రసంగం కోసం వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.