ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతల అరెస్టులు, వాటిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఛానెల్‌లో పనిచేసే జర్నలిస్ట్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ నేతలను జైలు నుంచి బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం చేయడం లేదని.. వారిపై చార్జ్ షీట్లు వేయడం లేదని వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు, ఆపై ఆయన ప్రశ్నించిన తీరు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
వైసీపీ నేతల అక్రమ అరెస్టులు జరిగి 90 రోజులు దాటినా, కూటమి ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వెంకటకృష్ణ ప్రశ్నించారు. నిందితులపై ఇప్పటికీ ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడం వల్ల, ఏ1, ఏ4 వంటి ప్రధాన నిందితులకు సైతం బెయిల్ లభించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వెంకటకృష్ణ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, వైసీపీ నేతలు బయటకు రాకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వైసీపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. “అక్రమంగా కేసులు పెట్టి 90 రోజులుగా జైల్లో ఉన్న వైసీపీ నేతలపై ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారా?” అంటూ వారు వెంకటకృష్ణను, ఏబీఎన్‌ను నిలదీస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి.