ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ అరెస్టును ఖండిస్తూనే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగని లిక్కర్ స్కామ్‌ను జరిగినట్లు చిత్రీకరిస్తూ, అబద్ధపు వాంగ్మూలాలతో మిథున్‌ను అక్రమంగా ఇరికించారని జగన్ ఆరోపించారు.
వైఎస్ జగన్ మాట్లాడుతూ, “తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడైన చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు. ఇదంతా ఆయనపై నమోదైన మద్యం స్కామ్ కేసును రద్దు చేసుకునేందుకే. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు” అని ధ్వజమెత్తారు.
చంద్రబాబుపై జగన్ ప్రశ్నలు వేశారు. 2014-19 మద్యం విధానాన్ని చంద్రబాబు ఎందుకు సమర్థించుకుంటున్నారని నిలదీశారు. మళ్లీ పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలు ఎందుకు అమలవుతున్నాయని ప్రశ్నించారు. మద్యం దుకాణాల లైసెన్స్‌లలో అవినీతి, అంతటా మాఫియా రాజ్యమేలుతోంది కదా అని కడిగేశారు.
ప్రజల తరఫున పోరాడేవారి గొంతు నొక్కడానికి చేసిన కుట్ర ఇది అని జగన్ పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్యంపై నేరపూరిత దాడి అని ఆయన అభివర్ణించారు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా వైఎస్సార్‌సీపీ ప్రజలతోనే ఉంటుందని, వారి తరఫున పోరాడుతుందని జగన్ స్పష్టం చేశారు.