జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ తన మిగిలిన సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లను త్వరగా పూర్తి చేయాలని అంబటి రాంబాబు కోరారు.
పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలా వద్దా అనేది ఆయన వ్యక్తిగత ఇష్టమని, దానిపై ఎవరికీ అధికారం లేదని జనసేన వర్గాలు అంటుండగా, రాంబాబు వ్యాఖ్యల వెనుక వైసీపీ రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యాక ‘హరిహర వీరమల్లు’ సినిమా టికెట్ ధరలు రూ.600 వరకు పెంచుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమే అని రాంబాబు ఆరోపించారు.
‘హరిహర వీరమల్లు’ చిత్రం ఐదేళ్లుగా నిర్మాణంలో ఉండటంతో నిర్మాత ఏ.ఎం. రత్నం ఆర్థికంగా నష్టపోయారని గుర్తు చేస్తూ, రాజకీయాల కారణంగా ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల నిర్మాతల కడుపుకొట్టవద్దని పవన్‌కు రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఆ రెండు సినిమాలు పూర్తయ్యాక పవన్ సినిమాల్లో నటించడం, నటించకపోవడం ఆయన ఇష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా “బ్లాక్ బస్టర్” అని రుద్దుతున్నారని, సినిమా ఫ్లాప్ అయినందుకు తాను చింతిస్తున్నానని రాంబాబు ఎద్దేవా చేశారు.