నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలీసులకు షాక్ ఇచ్చారు. పోలీసుల నోటీసులను లెక్కచేయకుండా, విచారణకు హాజరుకావడానికి నిరాకరించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు వచ్చేవరకు విచారణకు హాజరుకావాలా, లేదా అనేది నిర్ణయించుకోనున్నారు. ఒక కేసులో విచారణకు పిలిచి, మరో కేసులో అరెస్టు చేస్తారన్న భయం అనిల్ కు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అనిల్, అక్కడి నుంచే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
కోవూరు వివాదం, అనిల్ పై కేసు
కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మధ్య రాజకీయ వివాదం చెలరేగింది. ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని పతాక స్థాయికి చేర్చాయి. ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితంపై ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన స్థలాన్ని పరిశీలించిన అనిల్ కుమార్ యాదవ్, ప్రశాంతి రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. ఆమెపై విమర్శలు చేశారు. దీంతో ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినందుకు అనిల్ కుమార్ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణకు హాజరుకావాలని నోటీసులు అందించారు.
ప్రసన్న హాజరు, అనిల్ గైర్హాజరు
తన పరువుకు భంగం కలిగించారని ప్రశాంతి రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్ పై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న విచారణకు హాజరై, ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం వల్లే తాను విమర్శలు చేశానని పేర్కొన్నారు. విచారణ అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. అయితే, అదే కేసు విచారణకు ఈరోజు హాజరు కావాలని అనిల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చినా, ఆయన హాజరు కాలేదు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
అరెస్ట్ భయమే కారణమా?
అనిల్ కుమార్ యాదవ్ ఈ కేసు విచారణ విషయంలో భయపడడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. మరో కీలక వ్యక్తి సైతం అరెస్టు కావడం, ఆయన సైతం విచారణలో అనిల్ పేరు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే అనిల్ కుమార్ యాదవ్ అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రశాంతి రెడ్డి కేసు విషయంలో పిలిచి తనను అరెస్టు చేస్తారని అనిల్ అనుమానిస్తున్నందువల్లే నేటి విచారణకు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.