రాజకీయాలు, సినిమాలు – ఇవి రెండు వేర్వేరు రంగాలైనా, తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఇప్పుడు విడదీయరాని బంధంలా మారిపోయాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత, ఆయన సినిమాలు, ఆయన వ్యక్తిగత ఇమేజ్ అన్నీ రాజకీయ కోణంలోనే అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక పార్టీ ఒక సినిమాను వ్యతిరేకిస్తే, మరో పార్టీ దానికి మద్దతుగా నిలబడటం ఇప్పుడు రొటీన్ అయిపోయింది.
ఇక ఏపీలో ఈ పరిస్థితి మరింత ముదిరిపోయింది. సినిమాలపై పార్టీ లైన్ ప్రకారం అభిమానులు, సోషల్ మీడియా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో అల్లు అర్జున్ సందర్భం ఇందుకు ఉదాహరణ. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి సన్నిహితుడిగా నిలిచిన అల్లు అర్జున్, ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్లి మద్దతు ప్రకటించటం, మెగా అభిమానుల్లో చీలికలకు దారితీసింది. ఆ సమయంలో వైసీపీ ఆయనను తమవాడిగా ప్రొజెక్ట్ చేస్తూ, పుష్ప 2 రిలీజ్ టైమ్‌లో బాగా హడావిడి చేసింది. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య మళ్లీ సఖ్యత ఏర్పడినా, వైసీపీ మాత్రం ఆయన రూపంలో ఒక అవకాశం చూసుకుంది.
ఇప్పుడు అదే స్క్రిప్ట్ జూనియర్ ఎన్టీఆర్‌పై రాయబోతున్నట్లుంది. ఆగస్టు 13న విడుదల కానున్న వార్ 2 సినిమా చుట్టూ కూడా రాజకీయ చర్చ మొదలైంది. ఈ చిత్రం విడుదలకు సమాంతరంగా రజనీకాంత్ కూలీ సినిమా కూడా వస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేష్, కూలీ సినిమాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయగా, వార్ 2 గురించి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీన్ని గమనించిన వైసీపీ శ్రేణులు, “తారక్‌కు టీడీపీ మద్దతు ఉండదు” అనే లెక్క వేసి, సోషల్ మీడియాలో ఆయన సినిమాకు బలంగా మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి.
ఇది వైసీపీకి డబుల్ లాభం – ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులను ఆకర్షించడం, మరోవైపు టీడీపీతో ఆయన మధ్య ఉన్న దూరాన్ని చూపించడం. గతంలో అల్లు అర్జున్ కేసులో లాగా, ఈ సారి కూడా వైసీపీ ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తోంది.
మరి వార్ 2 హిట్టయితే… ఇది తారక్‌కి మాత్రమే కాదు, వైసీపీకి కూడా ఒక రాజకీయ పండగే అవుతుందేమో!