తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల్లో ప్రజా సమస్యలు పెరుగుతున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేతల విలాస ఖర్చులపై కొత్త ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు కోసం కొత్త హెలికాప్టర్ కొనుగోలు చర్యలు ప్రారంభమయ్యాయి.
కుప్పం పర్యటనలో చంద్రబాబు టూర్‌లో మెరిసిన కొత్త మెర్సిడెస్ బెంజ్, వెంటనే వెలుగులోకి వచ్చిన తాజా వార్త – ప్రభుత్వం కొనబోయే ఎయిర్‌బస్ H-160 హెలికాప్టర్. చిప్సన్ ఏవియేషన్ నుంచే ఈ కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేయనుందని సమాచారం. ఇంకా కమిటీ సక్రమంగా ఏర్పాటవకముందే, అడ్వాన్స్ చెల్లింపులు సహా అన్ని ఆర్థిక లావాదేవీలు పూర్తయినట్టు తెలిసింది.
ఈ హెలికాప్టర్ ప్రధానంగా చంద్రబాబు కోసం కరకట్ట – గన్నవరం ఎయిర్‌పోర్టు, కుప్పం ఇల్లు – బెంగళూరు ఎయిర్‌పోర్టు మధ్య వినియోగించనున్నారు. అంటే, ప్రయాణం అంతా విలాసం.. సౌకర్యం అంతా ప్రత్యేకం.
కానీ, రాష్ట్ర ప్రజలకు మాత్రం ఈ వ్యవహారం గుదిబండలా మారింది. ఎందుకంటే.. ఖజానా అప్పుల్లో కూరుకుపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యమవుతున్నాయి. పేదలకు సంక్షేమ పథకాలు తగ్గింపులు ఎదుర్కొంటున్నాయి. అయినా నేతల విలాసాల కోసం కోట్ల రూపాయలు వెచ్చించేందుకు వెనకాడటం లేదు.
ప్రజలు సాధారణ బస్సు ఛార్జీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో, నాయకులు కొత్త హెలికాప్టర్లలో విలాసంగా విహరిస్తున్నారు. “ప్రజల కోసం త్యాగం” అనే మాటలు ఒక వైపు, “నాయకుల కోసం జల్సాలు” మరోవైపు – ఈ ద్వంద్వ ధోరణే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ ప్రచారంపై అధికారిక వర్గాలు మరియు ఇతర విశ్వసనీయ సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి పర్యటనల కోసం ప్రభుత్వం కొత్త హెలికాప్టర్‌ను కొనుగోలు చేయలేదు. ఇప్పటి వరకు పర్యటనల కోసం అద్దెకు తీసుకుంటున్న పాత హెలికాప్టర్ స్థానంలో, మెరుగైన భద్రత, సౌకర్యాలు ఉన్న ఒక అధునాతన మోడల్‌ను అద్దెకు తీసుకుంటున్నారు అని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. మరి ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.