తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరులో కూటమి పార్టీల మధ్య విభేదాలు రచ్చ రేపాయి. సోమవారం టిడిపి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కూటమి సమన్వయ సమావేశంలో, జనసేన నేతలు నామినేటెడ్ పదవుల కోసం డిమాండ్ చేశారు. ఆశించిన ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదనతో వాగ్వాదం చోటుచేసుకుంది.
వివాదం అక్కడితో ఆగకుండా అర్ధరాత్రి రహదారిపై ఘర్షణలకు దారి తీసింది. టిడిపి నేతలు జనసేన శ్రేణులపై దాడి చేసి, దారుణంగా కొట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దాడిలో పలువురు జనసేన నేతలు గాయపడ్డారు. గాయపడిన వారు దొమ్మేరు సెంటర్లో నిరసన దీక్ష చేపట్టగా, స్థానికులకు పరిస్థితి అర్థం కాకపోయింది.
గతంలోనే కొవ్వూరులో కూటమి అంతర్గత విభేదాలు బహిర్గతం అయ్యాయి. నామినేటెడ్ పదవుల కేటాయింపుపై జనసేన ఇన్చార్జ్ టీవీ రామారావు సస్పెన్షన్ కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో తాజా ఘటన కూటమి భవిష్యత్తుపై మరింత సందేహాలు రేకెత్తిస్తోంది.
స్థానిక డీఎస్పీ దేవకుమార్ జోక్యం చేసుకుని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో జనసేన నేతలు దీక్షను విరమించారు.https://x.com/greatandhranews/status/1965293337528988134