పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఓజీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో బెనిఫిట్ షోల టికెట్ ధరలను రూ.1000కి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై నిర్మాత సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది.
ఈ కృతజ్ఞతా ప్రకటనపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నందున, ఆయన సినిమాకు టికెట్ ధరలు పెంచుకునే అధికారం ఆయనకే ఉందని, దానికే ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో విమర్శలు, మీమ్స్:
‘మీ సినిమాకు మీరే పెంచుకుని, మీరే ధన్యవాదాలు తెలుపుకోవడం విడ్డూరంగా ఉంది’ అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ‘పవన్ కళ్యాణ్ తన సినిమాలకు అధిక ధరలు పెట్టుకోవడానికి ప్రభుత్వంలోకి వచ్చారు’ అనేలా మీమ్స్, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఈ ఒక్క ఫొటోతో పవన్ పరువు తీశారు’ అనే క్యాప్షన్ తో పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. నిర్మాత సంస్థ ఇచ్చిన ధన్యవాదాల పోస్ట్‌ను, పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న పదవిని కలిపి ట్రోల్స్ చేస్తున్నారు.
మరోవైపు, ఇది ప్రభుత్వ నిర్ణయం అని, నిర్మాతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడంలో తప్పు లేదని, ఇది రాజకీయంగా విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతివాదన చేస్తున్నారు.
ఏది ఏమైనా, ‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే, ఈ టికెట్ ధరల పెంపు అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో, ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.